సాంబాయిగూడెం నుంచి రామనుజవరం వరకు ఇసుక లారీలను రహదారిపై నిలిపివేయడంతో సోమవారం గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అత్యవసర సేవలకు సంబంధించిన అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూ, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మొత్తం ఇసుక లారీలతో నిండిపోవడంతో సాధారణ వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకుంటూ రహదారి దాటించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
ఇసుక ర్యాంపుల వద్ద సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోయినా అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. రహదారులపై లారీలను యథేచ్ఛగా నిలిపివేయడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం, రామనుజవరం, సాంబాయిగూడెం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక ర్యాంపుల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు.









