ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కీలక ఉపశమనం కల్పించింది. 201920 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్లో చేరిన అర్హులైన విద్యార్థులకు మొదటి ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
దీంతో గతంలో అనుమతించిన నాలుగు ప్రయత్నాలకు అదనంగా ఒకసారి పరీక్ష రాసే వీలు కలుగుతుంది. మొత్తం ఐదు ప్రయత్నాల వరకు అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ఒక్కసారి మాత్రమే వర్తించే ప్రత్యేక వెసులుబాటు.
కొవిడ్ పరిస్థితులు.. ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం
విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి కారణంగా విద్యాభ్యాసంలో ఎదురైన అంతరాయాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల కొందరు విద్యార్థులు నిర్ణీత ప్రయత్నాల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు అవకాశం కల్పించినట్లు కమిషన్ తెలిపింది.
నాలుగేళ్ల గడువు దాటినా అవకాశం
ఎంబీబీఎస్ మొదటి ప్రొఫెషనల్ కోర్సును పూర్తి చేయడానికి నిర్దేశించిన నాలుగేళ్ల వ్యవధి దాటిన విద్యార్థులు కూడా ఈ అదనపు అవకాశానికి అర్హులు కావచ్చు. అయితే సంబంధిత వైద్య కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో వారి ప్రవేశం చెల్లుబాటులో ఉండాలి. ప్రవేశాన్ని రద్దు చేసి ఉండకూడదు.
ఇప్పటికే గతంలో ఇచ్చిన అదనపు అవకాశం సహా ఐదు ప్రయత్నాలన్నింటినీ వినియోగించుకున్న విద్యార్థులకు మరోసారి అవకాశం ఉండదు. ఆరో ప్రయత్నానికి అనుమతి లేదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి పదేళ్ల పరిమితి
ఈ వెసులుబాటు వల్ల ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి ఉన్న గరిష్ఠ కాలపరిమితిలో మార్పు ఉండదు. ప్రవేశం పొందిన తేదీ నుంచి తప్పనిసరి వైద్య ఇంటర్న్షిప్ సహా మొత్తం కోర్సును పదేళ్లలోపు పూర్తి చేయాల్సిందే.
ఈ నిర్ణయం అర్హత కలిగిన పెండింగ్ కేసులకు మాత్రమే వర్తించే తాత్కాలిక మినహాయింపు. భవిష్యత్తులో అన్ని విద్యార్థులకు ఇదే విధానం వర్తిస్తుందని భావించరాదని కమిషన్ స్పష్టం చేసింది. అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సూచించింది.
అదనపు అవకాశం అందరికీ ఆటోమేటిక్గా వర్తించదు. విద్యార్థులు తమ కళాశాల లేదా విశ్వవిద్యాలయాన్ని సంప్రదించి అర్హతను నిర్ధారించుకోవాలి.












