మండల వ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శివాలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా చింతల బయ్యారం గ్రామ సమీపంలోని గోదావరి నది తీరాన వెలసిన శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఉదయం 6 గంటల నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించబడతాయి. రాత్రి 2:30 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం చుట్టూ భారీ ఎత్తున విద్యుత్ దీపాలంకరణ చేశారు. దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే ఊరేగింపునకు, రథోత్సవానికి సుందరమైన పల్లకిని సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేసి, అందంగా తీర్చిదిద్దారు.
భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. గోదావరి నది తీరాన స్నాన ఘట్టాల వద్ద లోతు ప్రదేశాలను సూచిస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మహిళలు సురక్షితంగా స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలతో భక్తులు జాగరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
జాతరకు వచ్చే భక్తుల వినోదం కోసం భజన, కోలాట సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మంచి నీటి సదుపాయం, మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అత్యవసర చికిత్స కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ, అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు.












