మణుగూరు పట్టణంలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం రాత్రి భోజనం చేసిన 24 మంది విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
భోజనం తర్వాత విద్యార్థినులలో అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే మణుగూరు వంద పడకల ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొదట హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు ఆదివారం తల్లిదండ్రులు తెచ్చిన ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అయితే, ఆసుపత్రికి తరలించిన సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంటిలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు.
హాస్టల్ లోపలికి ఎవరినీ అనుమతించకపోవడం, అధికారుల విచారణలో పలు అసంబద్ధతలు బయటపడటంతో ఇంటిలిజెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాతే 24 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు నిర్ధారించారు. ఆదివారం నలుగురు మాత్రమే తల్లిదండ్రులు తెచ్చిన ఆహారం తిన్నప్పుడు, 24 మందికి ఎలా ఫుడ్ పాయిజన్ అయిందన్న అధికారుల ప్రశ్నకు హాస్టల్ సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు.
రెసిడెన్షియల్ స్కూల్లో ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడం, కలుషిత ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆదివారం పిల్లలకు అందించిన మటన్‌ను వెటర్నరీ వైద్యులచేత తనిఖీ చేయించారా అని నియోజకవర్గ ఇంటిలిజెన్స్ అధికారి రామారావు ప్రశ్నించగా, పాల్వంచ నుండి మటన్ తెప్పించామని, తనిఖీ చేయించలేదని వార్డెన్ సమాధానమిచ్చారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


