భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నీట్ పరీక్షకు వెళ్తున్న ఓ విద్యార్థిని, ఇసుక లారీల రద్దీతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కారణంగా పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకుని పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఘటనపై రేణుక అక్షర మహిళా మండలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన విద్యార్థిని కలలు ఒక్క నిమిషం ఆలస్యంతో చెదిరిపోవడం బాధాకరమని మండలి అధ్యక్షురాలు పూనం సరోజ అన్నారు. ఇసుక ర్యాంపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో లారీలు, టిప్పర్లు రోడ్లపై తిరుగుతున్నాయని, అయితే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రధాన రహదారులపై ఇసుక లారీల రద్దీ పెరుగుతున్నా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేవని, వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాల్సిన ఆర్టీఓ, బ్రేక్ ఇన్స్పెక్టర్లు తమ బాధ్యతలను విస్మరించారని మండలి విమర్శించింది.
కమిషన్ల మత్తులో కొందరు అధికారులు విధులు నిర్వర్తించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపుల యాజమాన్యాలు, సంబంధిత శాఖల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా మండలి కోరింది. నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించింది.









