మణుగూరు ఏరియా జిఎం కార్యాలయంలో సింగరేణి పాఠశాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ చేతుల మీదుగా యూనిఫార్మ్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని వై. యమునాను సన్మానించారు.
శుక్రవారం (20.02.2026) మణుగూరు ఏరియా జిఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవా భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఇతర కార్యక్రమాల్లోనూ రాణించాలని ఆయన సూచించారు.
ఇటీవల జరిగిన కుంపూ అండ్ ఉషు ఛాంపియన్ షిప్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించిన ఆరవ తరగతి విద్యార్థిని వై. యమునాను జనరల్ మేనేజర్ అభినందించారు. ఆమె సాధన పాఠశాలకు, ఏరియాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తన విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కారణమని వై. యమునా తెలిపింది. ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలని జనరల్ మేనేజర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.








