మానుగూరు, జూలై 29
రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ సూచించారు. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో నదులు, వాగులు, కాలువలు, చెరువులు వంటి జలవనరుల వద్దకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని, రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల నేపథ్యంలో పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, గ్రామీణ నీటి సరఫరా అధికారులు తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఆదేశించారు.
అదేవిధంగా, వర్షాల సమయంలో తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, చిన్నారులను వాటి సమీపానికి వెళ్లనివ్వకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ విజ్ఞప్తి చేశారు.






