కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోతే గ్రామంలో ప్రజల సౌకర్యార్థం, మంచి నీటి అవసరాల నిమిత్తం నూతన హ్యాండ్ బోర్ పనులను బుధవారం ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.
మోతే గ్రామంలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యార్థం, గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం హ్యాండ్ బోర్ ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తికి సర్పంచ్ పోలేబోయిన సుజాత స్పందించారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, సంబంధిత అధికారులు ఎంపీడీవో, ఎంపీఓల సహకారంతో ఎంపీపీ నిధుల నుంచి ఈ పనులకు నిధులు మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో సర్పంచ్ పోలేబోయిన సుజాత, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. నూతన బోర్ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ ముత్యాలమ్మ తల్లి గుడి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం, అలాగే గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం ఈ బోర్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇది గ్రామ అభివృద్ధి దిశగా పంచాయతీ చేపట్టిన చర్యలలో ఒకటని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అక్కిరెడ్డి నిర్మల, సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగం వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, వాసిరెడ్డి రాజేందర్, మోతే గ్రామస్థులు, పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









