మణుగూరు ఏరియా పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో మణుగూరు ఏరియా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, దుర్గం సుమతి రామచందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం దంపతులు శమీపూజలో పాల్గొని, ఉచిత టీ, బిస్కెట్ల స్టాల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి సంస్థ సాధిస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. సంస్థ నికర లాభాల్లో 34 శాతం వాటా కింద సుమారు రూ.596 కోట్లను కార్మికులకు అందించడం, రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1,53,912 చొప్పున బోనస్, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించడం అభినందనీయమని తెలిపారు. వైద్యపరంగా అనర్హులైన ఉద్యోగుల అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించడం, త్వరలో పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ పత్రాలు అందజేయడానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలిపారు.
సింగరేణి సీఎస్ఆర్ కింద మొత్తం రూ.25 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లు, రహదారులు, డ్రైనేజీలు, భవనాలు, విద్యాసంస్థలకు ఫర్నిచర్, ఆర్వో నీటి ప్లాంట్లు, బోరు బావులు, పండ్ల మొక్కల పంపిణీ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం ప్రశంసనీయమని తెలిపారు. సింగరేణి సేవా సమితి ద్వారా యువతకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తోందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, అధికారుల వేతనాల అప్గ్రేడేషన్ వంటి అంశాలు సానుకూలంగా ముందుకు సాగాలని, మణుగూరు ఏరియా గనులు ఉత్పత్తి, ఉత్పాదకతలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ... దసరా వేడుకలను విజయవంతం చేసేందుకు తమ వేతనాల నుంచి రూ.250 చొప్పున విరాళాలు అందించిన ఉద్యోగులకు, సహకరించిన కార్మిక సంఘాల నాయకులకు, అధికారుల సంఘమైన సి ఎం ఓ ఏ ఐ ప్రతినిధులకు, మణుగూరు ఏరియా ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాష్ జ్యోతి మార్గదర్శకత్వంలో సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. మణుగూరు ఏరియా బొగ్గు గనులు సంస్థ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, బొగ్గు నాణ్యత, ఉత్పాదకత, రవాణా, యంత్రాల సమర్థ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో మణుగూరు ఏరియాకు నిర్దేశించిన 121.26 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రాంత ప్రజల పురోగతి కోసం మనమందరం ఐక్యంగా ముందుకు సాగుదామని తెలిపారు. రాష్ట్రస్థాయి, స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాణాసంచా విన్యాసాలు, రామలీల, రావణ దహనం కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాదిగా తరలివచ్చిన సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఉత్సవాలను తిలకించారు.












