మానుగూరు, 2026-11-22
ప్రజాధనంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మౌనిక రెస్టారెంట్ వెళ్లే దారిలో, శ్రీరామ్ ఇంటర్నెట్ వెనుక గల్లీలో ఆదివారం నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీని ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిధులతో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన రోడ్లను ఇలా ధ్వంసం చేస్తుంటే పర్యవేక్షణ బాధ్యత వహించాల్సిన మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం లేకుండానే ఈ పనులు జరుగుతున్నాయా లేక అధికారుల పర్యవేక్షణ లోపమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం కోసం మీడియా ప్రతినిధులు మున్సిపల్ ఏఈ సత్యను పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ, ఆయన స్పందించి సమాధానం ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన రోడ్లను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా అనుమతులు లేకుండా రోడ్లు, డ్రైనేజీలు ధ్వంసం చేస్తుంటే చర్యలు తీసుకునే వారెవరు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్డు ధ్వంసానికి గల కారణాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






