మణుగూరు పట్టణంలోని రాధికా కాన్సెప్ట్ స్కూల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని, తమ సోదరులైన విద్యార్థులకు రాఖీలు కట్టి, వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ఆత్మీయతను మరింత బలపరిచే పండుగ రక్షాబంధన్ అని పేర్కొన్నారు.
కుటుంబ బంధాలు, విలువలు, సంప్రదాయాల ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా విద్యార్థుల్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










