భద్రాద్రి కొత్తగూడెం, 2026-11-21
తల్లిదండ్రుల ఆవేశంలోనో, తెలియక చేసిన పొరపాటో వల్లనో పిల్లలను పెంచడం భారమై అనాధలుగా వదిలేసిన చిన్నారులను సొంత తల్లిదండ్రుల వలె చూసుకుంటూ, వారికి ఆలనా పాలనతో పాటు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత శిశు గృహ సిబ్బందికి సూచించారు.
శనివారం రాత్రి భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో ఉన్న శిశు గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులకు దూరమై అనాధలుగా ఉన్న చిన్నారుల పట్ల సిబ్బంది ప్రతిరోజూ జాగ్రత్తలు గమనిస్తూ ఉండాలని, పిల్లలకు ప్రతిరోజూ పోషకాహారం అందించాలని, అలాగే వారిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని అన్నారు.
అనంతరం శిశు గృహంలోని వంటగది, మరుగుదొడ్లు, ఆట స్థలం, రోగుల గది వంటి సౌకర్యాలను, ప్రాంగణం నిర్వహణను తనిఖీ చేసి, పిల్లల యోగక్షేమాలను, వారి అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
శిశు గృహంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, శిశు గృహాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శిశు గృహ వార్డెన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







